Andhra Pradesh: నన్ను ఎయిర్ పోర్టులో పడేశారు.. ఇప్పుడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాను!: రామ్ గోపాల్ వర్మ

  • విజయవాడకు చేరుకున్న వర్మకు పోలీసుల బ్రేక్
  • నగరంలోకి వెళ్లేందుకు అనుమతి నో.. ఎయిర్ పోర్టుకు తరలింపు
  • ట్విట్టర్ లో ఆవేదన వెళ్లగక్కిన వర్మ

తన విజయవాడ పర్యటనను ఏపీ పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. బలవంతంగా తనను గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించారనీ, ప్రస్తుతం తాను పోలీస్ కస్టడీలోనే ఉన్నానని వాపోయారు. తాను నిజం చెప్పాను కాబట్టే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కనుమరుగైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పోలీసులు వర్మను గన్నవరం విమానాశ్రయానికి బలవంతంగా తరలించిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

‘మీరు విజయవాడకు రావడానికి వీల్లేదు. విజయవాడలో ఎక్కడా మకాం ఉండటానికి వీల్లేదు అని పోలీసులు మమ్మల్ని తీసుకొచ్చి ఎయిర్ పోర్టులో పడేశారు. ఇంతలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. ఈ విషయంలో నేను, మా ప్రొడ్యూసర్ ఎంత అడిగినా పోలీసులు సమాధానం చెప్పకుండా గన్నవరం ఎయిర్ పోర్టులో పడేశారు’ అని వర్మ వీడియోలో వాపోయారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వచ్చే నెల 1న ఏపీలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వర్మ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకునేందుకు విజయవాడలో ఓ హోటల్ బుక్ చేయగా, దాని అనుమతి చివరి నిమిషంలో రద్దయింది. దీంతో ఈ అనుమతులు రద్దు కావడం వెనుక ఓ వ్యక్తి ఉన్నారన్న వర్మ.. నడిరోడ్డుపైనే మీడియా సమావేశం పెడతానని ప్రకటించారు. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు వర్మను ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చారు. ఈరోజు సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ కు 4 గంటలకు, 4.30 గంటలకు రెండు విమానాలు ఉన్నాయనీ, వీటిలో ఏదో ఒకదానిలో వర్మను పోలీసులు తిప్పి పంపే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News