Vijay Sai Reddy: తుపాను మీద సమీక్ష చేస్తే ఏం కమిషన్లు వస్తాయని చంద్రబాబు అక్కడే ఉండిపోయారు... అంతేగా, అంతేగా!: విజయసాయి సెటైర్
- ట్వీట్ చేసిన వైసీపీ నేత
- తుపాను వస్తోందని చంద్రబాబుకు తెలుసు
- అయినా సిమ్లాలోనే ఉన్నారు
వైసీసీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి సీఎం చంద్రబాబుపైనా, టీడీపీ నేతలపైనా సెటైర్లు వేశారు. ఎన్నికల సంఘం అడ్డుపడడం వల్లే పిడుగులు పడకుండా ఆపలేకపోయానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, కానీ ఫొని తుపాను వస్తుంటే సిమ్లాలో ఎందుకు విశ్రాంతి తీసుకుంటున్నట్టు అని ప్రశ్నించారు.
పోలవరం పైనా, సీఆర్ డీఏ పైనా సమీక్షలు చేస్తే కమిషన్లు వస్తాయి కానీ, తుపాను పైనా, తాగునీటి పైనా సమీక్షలు చేస్తే ఏం కమిషన్లు వస్తాయని చంద్రబాబు భావించినట్టున్నారు... అంతేగా, అంతేగా! అంటూ సినీ ఫక్కీలో వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయసాయి ట్వీట్ చేశారు. అంతేగాకుండా, మరికొన్ని ట్వీట్ల ద్వారా ఏపీ మంత్రులపైనా వ్యంగ్యం ప్రదర్శించారు.
త్వరలో తాను జైలుకెళ్లాల్సి ఉంటుందని ఓ మంత్రి అంటున్నాడని, ఆయన అంటున్నది నిజమేనని అన్నారు. వచ్చే ఏడాది చంద్రబాబు, లోకేశ్ లతో పాటు ఆ మంత్రి కూడా జైలుకు చేరకతప్పదు, అప్పుడు ఎలాగూ నేను వాళ్లను పరామర్శించడానికి జైలుకు వెళ్లాలి కదా అంటూ బదులిచ్చారు.
రాష్ట్రంలో రెవెన్యూ లోటు వచ్చే ఐదేళ్లలో రూ.4.79 లక్షల కోట్లు ఉంటుందని చంద్రబాబుగారి పత్రికలో రాశారని, దీనిపై మరిన్ని వివరాలు కావాలంటే 'సామాజిక ఆర్థిక మంత్రి' అయిన కుటుంబరావును అడగాలా?, 'నామమాత్రపు ఆర్థిక మంత్రి' అయిన యనమలను అడగాలా? అంటూ మరో ట్వీట్ చేశారు.