Telangana: బొమ్మలరామారం విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసు.. పోలీసుల అదుపులో ఏడుగురు అనుమానితులు
- తెలంగాణలో సంచలనం సృష్టించిన ఘటన
- ఘటనా స్థలంలోని బీరు బాటిళ్ల నుంచి వేలిముద్రల సేకరణ
- నిందితుల వేలి ముద్రలతో పోల్చి చూస్తున్న నిపుణులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన బొమ్మలరామారం సామూహిక అత్యాచారం, హత్య కేసులో రాచకొండ పోలీసులు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం స్పెషల్ క్లాసులకని ఇంటి నుంచి వెళ్లిన 14 ఏళ్ల బాలిక తిరిగి ఇంటికి రాలేదు. స్పెషల్ క్లాసులు ముగిసిన తర్వాత మరో ఇద్దరు బాలికలతో కలిసి ఆటో ఎక్కిన బాధిత విద్యార్థిని మల్యాల్ క్రాస్‌రోడ్డు వద్ద ఉదయం 11:30 గంటలకు దిగింది. తనతోపాటు వచ్చిన బాలికలు వెళ్లిపోయిన తర్వాత 20 నిమిషాలపాటు బాలిక తన ఊరి వారు ఎవరైనా వస్తారేమోనని అక్కడే వేచి చూసింది.
సాయంత్రం ఆమె మృతదేహం 50 అడుగుల లోతున్న ఎండిపోయిన బావిలో కనిపించింది. నిందితులు బాలికను వెంటాడి పట్టుకుని ఉంటారని, ఆ తర్వాత ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి ఉంటారని, ఆపై హత్య చేసి బావిలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఘటనా స్థలంలో ఉన్న బీరు బాటిళ్లపై ఉన్న వేలిముద్రలను పోలీసులు సేకరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ఏడుగురు అనుమానితులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వేలిముద్రలను నిందితుల వేలిముద్రలతో పోల్చి చూస్తున్నారు.