Bengaluru: భారత్‌లో రికార్డులు తిరగరాస్తున్న ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమా.. తొక్కిసలాటలో గాయపడిన మహిళ
- బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న అవెంజర్స్:ఎండ్‌గేమ్
- రెండు రోజులకే వంద కోట్ల క్లబ్లో చేరిక
- బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో మహిళకు తీవ్ర గాయాలు
హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ భారత్‌లో రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.1,186 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా భారత్‌లోనూ వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరిన అవెంజర్స్.. వారాంతానికి రూ.150 కోట్లు దాటేసింది. ఇక భారత్‌లోనూ ఈ సినిమాకు జనాలు పోటెత్తుతున్నారు.
బెంగళూరులో ఈ సినిమాను చూసేందుకు జనాలు విరగబడుతుండడంతో సినిమా హాళ్ల వద్ద జాతర వాతావరణం కనిపిస్తోంది. వైట్‌ఫీల్డ్‌లోని సినీపోలిస్ ఫోరం శాంతినికేతన్లో రాత్రి 10 గంటల షోకు వెళ్లిన 32 ఏళ్ల మహిళ తీవ్ర గాయాలపాలైంది. థియేటర్లోకి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా తోపులాట జరగడంతో మహిళ కిందపడిపోయింది. సినిమా ప్రదర్శనకు మూడు నిమిషాల ముందే థియేటర్ తలుపులు తెరుచుకోవడంతో జనాలు ఒక్కసారిగా హాల్లోకి పరుగులు తీశారని, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆమె కిందపడి గాయపడిందని మహిళతోపాటు సినిమాకు వచ్చిన ఆమె స్నేహితురాలు ఖైజర్ అహ్మద్ షరీఫ్ తెలిపారు.
జనాల తోపులాటలో మెట్ల వద్ద కిందపడిన ఆమె పెదవులు చిట్లిపోయాయని, పళ్లు విరిగాయని ఆమె పేర్కొంది. కిందపడిన ఆమెకు సాయం అందించేందుకు థియేటర్ యాజమాన్యం ముందుకు రాలేదని ఆమె ఆరోపించారు. దీంతో తానే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు ఖైజర్ వివరించారు.