Telangana: తెలంగాణలో కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్!
- ఇంటర్ బోర్డు ముట్టడికి విపక్షాల పిలుపు
- అంజన్ కుమార్, పొన్నం, కోదండరామ్ తదితరుల అరెస్ట్
- తీవ్రంగా ఖండించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ, నేడు ఇంటర్ బోర్డు ముట్టడికి విపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో, పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేశారు. తమ తమ ఇళ్లను దాటి బయటకు వచ్చిన విపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీ, సీపీఐ నేతలనూ అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు బయలుదేరగానే ఆయన్ను పోలీసులు నిర్బంధించారు. పొన్నం ప్రభాకర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తప్పు జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుందని గుర్తు చేశారు. జరిగిన తప్పును సరిదిద్దాలని తాము కోరుతున్నామని అన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. అధికారులపై చర్యలు తీసుకోలేదు కాబట్టే, తాము ధర్నాకు పిలుపునిచ్చామని అన్నారు. అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు.
కాగా, మేడ్చల్ లో కూన శ్రీశైలం గౌడ్ ను కూడా గృహ నిర్బంధం చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని భావిస్తున్న వారిపై టీఆర్ఎస్ సర్కారు దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. అరెస్ట్ లు ప్రజాస్వామ్యానికి విఘాతమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద పోలీసులు మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు.