Crime News: అమ్మో బామ్మ... 71 ఏళ్ల వయసులో చోరీలే వ్యాపకం!

  • ఆధ్యాత్మిక చింతనతో వృద్ధుల చెంతకు
  • అదను చూసుకుని బంగారం అపహరణ
  • పోలీసులనే ఆశ్చర్యపరిచిన ఆమె వైఖరి

ఆమె వయసు 71 ఏళ్లు. ఆ వయసులో రామా కృష్ణా అంటూ ఆధ్యాత్మిక చింతనతో గడిపేస్తుందని ఎవరైనా అనుకుంటారు. చోరీలకు పాల్పడుతుందని ఎవరైనా ఊహిస్తారా? సరిగ్గా ఇటువంటి ఆలోచనే ఆమెలో దురాశను రేకెత్తించింది. తన వయసు, తనపట్ల చూపే గౌరవాన్నే చోరీలకు మార్గంగా ఎంచుకుంది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యింది.

 గుంటూరు జిల్లా తెనాలి రెండో పట్టణ పోలీసులు అందించిన వివరాలు ఇలావున్నాయి. జవంగుల సరోజిని అలియాస్‌ దాసరి సామ్రాజ్యానికి ఇద్దరు కొడుకులు. ఒకరు తెనాలిలో  ఉద్యోగం చేస్తుండగా, మరొకరు సత్తెనపల్లిలో వ్యాపారం చేసుకుంటున్నారు. ఆర్థికంగా మెరుగైన కుటుంబం వారిది. సత్తెనపల్లిలోని కొడుకు వద్దే ఎక్కువ కాలం ఉండే సామ్రాజ్యం అప్పుడప్పుడూ తెనాలిలోని కొడుకు వద్దకు వచ్చి పోతూ వుంటుంది.

తెనాలి నందుపేటలోని వినాయకుని ఆలయంలో గత నెల 13వ తేదీన నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం జరిగింది. ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకాగా, ఎక్కువ మంది వృద్ధులు కూడా ఉన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తమ మెడలోని బంగారు నానుతాడు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని కార్యక్రమానికి హాజరైన ఇద్దరు వృద్ధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గుడిలోని సీసీ కెమెరాల పుటేజీ తెప్పించి పరిశీలించారు. కానీ నిందితులు తెలివిగా వాటికి దొరక్కుండా చోరీకి పాల్పడ్డారని గుర్తించారు. దీంతో కార్యక్రమాన్ని చిత్రీకరించిన ప్రైవేటు వీడియోగ్రాఫర్‌ నుంచి వీడియో తీసుకుని నిశితంగా పరిశీలించారు. నగలు పోగొట్టుకున్న వృద్ధురాళ్ల వద్దకు మరో వృద్ధురాలు రావడం, ‘దొంగలుంటారు జాగ్రత్త?’ అని వారిని హెచ్చరిస్తూ వారి మెడచుట్టూ పైటకొంగు కప్పడం గమనించారు. దీంతో పోలీసుల అనుమానం ఆమె పైకి మళ్లింది.

నిఘా వేసి ఉంచగా నిందితురాలు తెనాలి పట్టణంలోని ప్రకాశం బజార్‌లో తారసపడింది. అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె చెప్పిన విషయాలతో పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్లడం, అక్కడ బంగారం నగలు వేసుకున్న మహిళలు, వృద్ధులు తారసపడితే వారికి చేరువ కావడం, దొంగలుంటారని వారికి జాగ్రత్తలు చెప్పడం, అవకాశం చూసుకుని వారి మెడలోని వస్తువులు కాజేయడం అలవాటని తెలుసుకున్నారు.

ఇటువంటి సందర్భాల్లోనే ఆమె తెనాలిలోని కొడుకు వద్దకు వస్తుంటుందని కూడా తేల్చారు. కృష్ణా పుష్కరాలు, ఇతర  కార్యక్రమాల్లో జరిగిన చోరీలకు సంబంధించి విజయవాడ పరిధిలో ఆమెపై ఏడు కేసులు ఉన్నట్లు గుర్తించారు. గతంలో అక్కడ పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నట్లు కూడా తెలుసుకున్నారు. దీంతో ఆమెను అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి నగలను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News