Nimmakayala Chinarajappa: చంద్రబాబు ప్రభుత్వాధినేత...ఆయన సమీక్షలు చేయకూడదా?: ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
- చీఫ్ సెక్రటరీకి పాలనతో ఏం సంబంధం
- ఎన్నికల తర్వాత 45 రోజులు ప్రజల్ని గాలికి వదిలేయాలా?
- తుపాన్ వణికిస్తుంటే చర్యలు బాధ్యత ఎవరిది
రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉందని, ఆ ప్రభుత్వానికి అధినేత చంద్రబాబునాయుడని, మరి ముఖ్యమంత్రి సమీక్షలు చేయకూడదని అనడం ఎక్కడ విడ్డూరమని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో పోలింగ్ తర్వాత, ఫలితాలు ప్రకటించడానికి మధ్య 45 రోజుల సమయం ఉందని, ఈ కాలంలో ప్రజల్ని గాలికి వదిలేయాలా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తీరు కారణంగా రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా పాలనతో చీఫ్ సెక్రటరీకి ఏం సంబంధమని ప్రశ్నించారు.
ప్రస్తుతం రాష్ట్రాన్ని ‘ఫణి’ తుపాన్ వణికిస్తోందని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా సహాయక చర్యలపై సమీక్ష చేయరాదంటే ఎలా అని ప్రశ్నించారు. సీఎం సహాయ నిధికి సంబంధించిన చెక్లు బౌన్స్ అవుతున్నాయని, దానికి సీఎస్ బాధ్యత వహిస్తారా? అన్నారు. అధికారులను గుప్పెట్లో పెట్టుకుని కేంద్రం కక్ష సాధిస్తోందని చినరాజప్ప ఆరోపించారు. అయినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి తిరిగి అధికారాన్ని చేపడుతుందని జోస్యం చెప్పారు.