sri lanka: ఈసారి బౌద్ధ మందిరాలే ఉగ్రవాదుల టార్గెట్: శ్రీలంక ఇంటెలిజెన్స్ కు సమాచారం
- బౌద్ధులు ధరించే దుస్తులను కొనుగోలు చేసిన ముస్లిం మహిళ
- బౌద్ధులుగా మందిరాల్లోకి ప్రవేశించి పేలుళ్లకు ప్లాన్
- భయాందోళనలో శ్రీలంక ప్రజలు
ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలోని చర్చిలు, స్టార్ హోటళ్లను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. వందలాది మందిని బలిగొన్న ఈ వరుస పేలుళ్ల నుంచి సింహళీయులు ఇంకా తేరుకోలేదు. దీనికి తోడు మరిన్ని దాడులు జరగబోతున్నాయన్న వార్తలు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, శ్రీలంక ఇంటెలిజెన్స్ కు పిడుగులాంటి సమాచారం అందింది. ఈసారి బౌద్ధ మందిరాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు పాల్పడబోతున్నట్టు తమకు సమాచారం అందిందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. స్థానిక ఉగ్ర సంస్థ ఈ దాడులకు స్కెచ్ వేసిందని చెప్పారు.
మార్చి 30వ తేదీన ఒక ముస్లిం మహిళ బౌద్ధులు ధరించే తొమ్మిది దుస్తులను రూ. 29వేల శ్రీలంక కరెన్సీతో కొనుగోలు చేసిందని అధికారులు తెలిపారు. గిరియుల్లా టెక్స్ టైల్ పార్కులో ఈ వస్త్రాలను కొనుగోలు చేసిందని చెప్పారు. ఈ వస్త్రాలు ధరించి, బౌద్ధులుగా బౌద్ధ మందిరాల్లోకి ప్రవేశించి, పేలుళ్లకు పాల్పడేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. తాజా సమాచారంతో శ్రీలంక ప్రజలు హడలిపోతున్నారు.