Andhra Pradesh: వర్మా.. వైఎస్ కుటుంబం చేసిన హత్యలపై సినిమా తీసే దమ్ము నీకు ఉందా?: టీడీపీ నేత మాల్యాద్రి
- జగన్ ఒక్క ప్రజా సమస్యపై కూడా స్పందించలేదు
- వర్మ సినిమాపై ఆగమేఘాల మీద ట్వీట్ చేశారు
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిశాక ఒక్క ప్రజా సమస్యపై కూడా వైసీపీ అధినేత జగన్ స్పందించలేదని టీడీపీ సీనియర్ నేత మాల్యాద్రి విమర్శించారు. అలాంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో ఆగమేఘాల మీద ట్విట్టర్ లో స్పందించారని దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పాటిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే వర్మ వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్త చేశారు. అమరావతిలో ఈరోజు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాల్యాద్రి మాట్లాడారు.
‘గత 18 రోజుల్లో ఒక్క ప్రజా సమస్యపై అయినా జగన్ స్పందించాడా? కానీ ఒక అశ్లీల సినిమాల నిర్మాత, దర్శకుడు వర్మ సినిమాపై మాత్రం ఆగమేఘాల మీద ఎందుకు ట్వీట్ చేశారు? ఈ సినిమాను మీరే తీశారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం’ అని మాల్యాద్రి స్పష్టం చేశారు. ‘మే 23 వరకూ చంద్రబాబు ఆగలేరా అని పదేపదే ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలకు ఓ ప్రశ్న. మే 23 వరకూ వర్మ ఎందుకు ఆగలేడు? జగన్ ఎందుకు ఆగలేడు? అన్నదానిపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. వర్మను కూడా ఓ ప్రశ్న అడుగుతున్నాం. వైఎస్ కుటుంబం చేసిన హత్యలపై సినిమా తీసే దమ్ము ఈ వర్మకు ఉందా?’ అని సవాల్ విసిరారు.