Sri Lanka: ఉగ్రదాడుల అనంతరం తన మేలుజాతి శునకాలను సైన్యానికి అప్పగించిన శ్రీలంక మహిళా లెక్చరర్
- అన్నీ జర్మన్ షెపర్డ్ శునకాలే!
- సర్వత్రా అభినందనలు
- త్వరలోనే కుక్కలకు ప్రత్యేక శిక్షణ
శ్రీలంకలో ఓ మహిళా లెక్చరర్ స్ఫూర్తిదాయక చర్య అందరినీ ఆకట్టుకుంటోంది. ఈస్టర్ సందర్భంగా కొలంబోలో జరిగిన పేలుళ్లతో డాక్టర్ షిరు విజేమన్నే అనే అధ్యాపకురాలు ఎంతో చలించిపోయారు. ఉగ్రదాడుల సందర్భంగా సైన్యం ఎంతో క్రియాశీలక పాత్ర పోషించడం గమనించిన ఆమె వెంటనే తన వద్ద పెరుగుతున్న 5 మేలు జాతి శునకాలను వారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఆ ఐదు కుక్కలు జర్మన్ షెపర్డ్ జాతికి చెందినవి. వాటికి సరైన రీతిలో శిక్షణ ఇస్తే పేలుడు పదార్థాలను ఇట్టే పసిగట్టేస్తాయి. ఈ విషయం తెలిసిన డాక్టర్ షిరు విజేమన్నే ఆ కుక్కలు తన వద్ద ఉండడం కంటే సైన్యం వద్ద ఉంటేనే దేశానికి ఉపయోగం అని భావించారు. అందుకే వాటిని బ్రిగేడియర్ అమరసకేరాకు అప్పగించారు.
ఆ ఐదు జర్మన్ షెపర్డ్ కుక్కలకు త్వరలోనే శ్రీలంక ఇంజినీర్స్ స్క్వాడ్రన్ లో ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నారు. ఈ మహిళా లెక్చరర్ స్ఫూర్తిదాయక చర్య సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రతి ఒక్కరూ ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.