MAA: ‘మా’ నూతన కార్యవర్గం తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. వెల్లడించిన జీవిత, రాజశేఖర్, నరేశ్
- సమస్యల కోసం హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు
- రూ. 6 వేలకు పెరిగిన పింఛను
- రూ. 25 వేలు చెల్లించే కొత్త సభ్యులకు రెండేళ్ల సభ్యత్వ కార్డు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నూతన కార్యవర్గం సోమవారం హైదరాబాద్‌లో తొలిసారిగా సమావేశమైంది. 2019-2021 కాలానికి గాను ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘మా’ సభ్యలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటుంటే వాటిని తెలియజేసేందుకు ప్రత్యేకంగా 95020 30405 నంబరుతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అందిస్తున్న పింఛనును వెయ్యి రూపాయలు పెంచి ఇకపై రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ‘మా’ సభ్యులకు కూడా వర్తించేలా ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు.
రూ.25 వేలు చెల్లించి ‘మా’లో చేరే కొత్త సభ్యులకు రెండేళ్లకు గాను తొలుత గోల్డ్ కార్డు అందించనున్నారు. ఈ రెండేళ్లలో మరో రూ.75 వేలు చెల్లిస్తే జీవిత కాల సభ్యత్వ కార్డు జారీ చేయాలని కార్యవర్గం నిర్ణయించింది. కొత్త సభ్యుడు శాశ్వత సభ్యుడు అయ్యేంత వరకు వీరికి అసోసియేషన్ నుంచి ఎటువంటి సౌకర్యాలు వర్తించవు. లేదంటే ఒకేసారి రూ. 90 వేలు చెల్లించిన వారికి రూ.10 వేల రాయితీతో పాటు శాశ్వత సభ్యత్వకార్డు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ఈ అవకాశం 100 రోజులు మాత్రమే. ఇప్పటి వరకు రూ.2 లక్షల వరకు ఎస్బీఐ సంపూర్ణ సురక్షా జీవిత బీమాను వర్తింప జేయగా దీనికి ఇప్పుడు మరో లక్ష రూపాయలు జోడించి రూ. 3 లక్షల బీమాను అందించనున్నట్టు ‘మా’ అధ్యక్షుడు నరేశ్, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌లు తెలిపారు.