Nellore District: స్నేహితుడ్ని ఆదుకోవడానికి యువతి దోపిడీ ప్లాన్... పోలీసులను కలుపుకుని రూ. 50 లక్షలు కొట్టేసిన వైనం!
- 15న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ
- పోలీసులమంటూ వచ్చి డబ్బు తీసుకెళ్లిన ఐదుగురు
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ రైలులో జరిగిన దోపిడీపై విచారణ జరిపిన పోలీసులు విస్తుపోయే నిజాలను వెలికితీశారు. ఈ నెల 15వ తేదీన నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో పోలీసులమంటూ వచ్చి రూ. 50 లక్షలు దోచేసిన కేసులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతని గర్ల్ ఫ్రెండ్, మరో ముగ్గురు పోలీసులు నిందితులని రైల్వే డీఎస్పీ వెల్లడించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కావలికి చెందిన అనిత అనే యువతి మల్లికార్జున అనే బంగారం వ్యాపారి వద్ద పనిచేస్తోంది. చెన్నాయపాలెంకు చెందిన టీడీపీ కార్యకర్త రవితో ఆమె సన్నిహితంగా ఉండేది.
రవి అప్పుల పాలు కావడంతో అతనికి ఆర్థికంగా ఆసరాగా ఉండాలని నిర్ణయించుకుంది. 15న చెన్నైకి వెళ్లి బంగారం బిస్కెట్లను తేవాలని అనితకు చెప్పగా, ఆమె విషయాన్ని రవికి చేరవేసింది. రవి వెంటనే తన బంధువైన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మహేశ్ ను సాయం కోరాడు. తనతో పాటు పనిచేస్తున్న సుల్తాన్ బాషా, సుమన్ కుమార్ లను కలుపుకున్నాడు. అంతా కలిసి, రైలులో అనిత బృందాన్ని అటకాయించి, తాము పోలీసులమని బెదిరించి, నగదున్న బ్యాగుతో గూడూరులో దిగిపోయారు. ఆ వెంటనే డబ్బును పంచుకున్నారు.
ఇక తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అనిత, గూడూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులకు అనిత వైఖరిపైనే అనుమానం వచ్చింది. ఆమెను గట్టిగా ప్రశ్నించగా, అసలు విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేసి, వారి నుంచి డబ్బు రికవరీ చేశామని రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.