Baghdadi: ఐసిస్ చీఫ్ బాగ్దాదీ బతికే ఉన్నాడు.. ఐదేళ్ల తర్వాత తొలి వీడియో విడుదల
- ఐదేళ్ల తర్వాత బయటకు వచ్చిన ఐసిస్ చీఫ్
- ఇస్లాంపై క్రైస్తవుల క్రూరత్వానికి ముగింపు తప్పదన్న బాగ్దాదీ
- 40 సెకన్లపాటు మాత్రమే మాట్లాడిన వైనం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్-బాగ్దాదీ బతికే ఉన్నాడు. సిరియాలో పాతుకుపోయిన ఐసిస్‌ను అక్కడి సైన్యం తరిమికొట్టింది. ఈ క్రమంలో జరిగిన బాంబు దాడుల్లో అతడు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. అయితే, అది నిజం కాదని తేలింది. 2014 నుంచి కనిపించకుండా పోయిన బాగ్దాదీ తాజాగా ఓ వీడియోలో దర్శనమిచ్చాడు.
శ్రీలంకలో ఈస్టర్ సండే నాడు ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని దాడి జరిగిన మూడు రోజుల తర్వాత ఐసిస్ ప్రకటించింది. ఐదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న బాగ్దాదీ శ్రీలంక పేలుళ్ల తర్వాత వీడియోలో కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కలష్నికోవ్ రైఫిల్ పట్టుకుని బాసింపట్టు వేసుకుని కూర్చున్న బాగ్దాదీ ఆ వీడియోలో కేవలం 40 సెకన్లపాటు మాత్రమే మాట్లాడాడు. ఇస్లాం కోసం తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్న బాగ్దాదీ సిరియా పట్టణమైన బాఘుజ్లో తమ పోరాటం ముగిసిందన్నాడు. ఇస్లాంపై క్రైస్తవుల క్రూరత్వం, హింసాత్మక చర్యలు కొనసాగుతున్నాయన్నాయని, వాటికి ముగింపు తప్పదని హెచ్చరించాడు.