IIT JEE: జేఈఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి ఇనుమడించింది: చంద్రబాబునాయుడు
- నిన్న రాత్రి జేఈఈ ఫలితాల వెల్లడి
- టాప్ 10 ర్యాంకుల్లో 3 ఏపీకే
- అభినందనలు తెలిపిన చంద్రబాబు
నిన్న రాత్రి ప్రకటించిన జేఈఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి దేశవ్యాప్తంగా ఇనుమడించిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరమూ అర్హత సాధించే వారిలో 30 నుంచి 40 శాతం వరకూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారని, అందరికీ తాను అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా ట్వీట్లు చేశారు.
"జేఈఈ మెయిన్ ఫలితాలలో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల ప్రతిభతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి దేశవ్యాప్తంగా ఇనుమడించడం సంతోషం. తొలి 10ర్యాంకులలో 3 ర్యాంకులు, మొదట 24మందిలో 6గురు ఏపి, తెలంగాణ విద్యార్ధులే కైవసం చేసుకోవడం ముదావహం" అని ఆయన అన్నారు. ఆపై "ప్రతి ఏటా జెఈఈ మెయిన్ లో 30% నుంచి 40% ర్యాంకులలో రెండు తెలుగు రాష్ట్రాలవారే ఉండటం అభినందనీయం" అని అన్నారు.
"నెల్లూరు జిల్లా నర్సాపురంకు చెందిన బట్టేపాటి కార్తికేయ, అనంతపురంకు చెందిన కొండా రేణు, విజయవాడకు చెందిన యెందుకూరి జయంత్ ఫణిసాయి, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బొజ్జా చేతన్ రెడ్డి వరుసగా 5,9,19,21 ర్యాంకులు సాధించడం రాష్ట్రానికే గర్వకారణం" అని ఓ ట్వీట్ లో, "పరీక్షా విధానంలో మార్పులు వచ్చినా, పర్సంటైల్ విధానంలో కూడా, డెసిమల్ స్కోర్ లో కూడా ముందు ఉండటం తెలుగు విద్యార్ధుల ప్రతిభకు నిదర్శనం. అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు" అని మరో ట్వీట్ లో చంద్రబాబు వ్యాఖ్యానించారు.