Nellore District: నెల్లూరు జిల్లాలో 15 మీటర్ల మేర ముందుకు వచ్చిన సముద్రం
- తీర ప్రాంతంలో వేగంగా వీస్తున్న ఈదురు గాలులు
- పలు చోట్ల కోతకు గురైన తీర ప్రాంతం
- అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరిక
ఫణి తుపాను ఈరోజు భీకరంగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న చెన్నైకి ఆగ్నేయంగా 880 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫణి... తన దిశను మార్చుకుని ఈశాన్యం వైపు ప్రయాణిస్తోంది. ఒడిశా వద్ద తీరం దాటే అవకాశాలు ఉండటంతో... శాస్త్రవేత్తలు నిరంతర నిఘా ఉంచారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని విడుదల చేస్తున్నారు.
మరోవైపు, నెల్లూరు జిల్లాలో ఫణి ప్రభావం తీవ్రంగా ఉంది. తీర ప్రాంతాల్లో ఈదురు గాలులు చాలా వేగంగా వీస్తున్నాయి. 15 మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. పలు చోట్ల తీర ప్రాంతం కోతకు గురైంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.