EVM: లెక్కింపు సమయంలో ఈవీఎం పనిచేయకుంటే... ఏం చేస్తారో చెప్పిన ద్వివేది!
- మెజారిటీ కన్నా ఈవీఎంలో పడ్డ ఓట్లు ఎక్కువగా ఉండాలి
- అప్పుడే రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేస్తాం
- తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారిదేనన్న ద్వివేది
మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయన్న సంగతి తెలిసిందే. లెక్కింపు సమయంలో ఏదైనా ఈవీఎంలో పడ్డ ఓట్ల సంఖ్యను చూపించడంలో అది మొరాయిస్తే, అప్పుడు ఏం చేయాలో తమకు స్పష్టమైన మార్గదర్శకాలున్నాయని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.
మొండికేసిన ఈవీఎంలను తొలుత పక్కన పెడతామని, మిగతా ఈవీఎంలన్నీ లెక్కించిన తరువాత అత్యధిక ఓట్లను సాధించిన అభ్యర్థికి, సమీప ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థికి మధ్య ఉన్న ఓట్ల తేడాను చూస్తామని ఆయన అన్నారు. మొరాయించిన ఈవీఎంలో పోలైన ఓట్ల కన్నా మెజారిటీ తక్కువగా ఉన్న పక్షంలో అక్కడ రీపోలింగ్ నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసే అధికారం తమకుందని అన్నారు.
ఉదాహరణకు అభ్యర్థికి వచ్చిన మెజారిటీ నాలుగైదొందలే అయినప్పుడు, మొరాయించిన ఈవీఎంలో అంతకన్నా ఎక్కువ ఓట్లు పడ్డట్టు తేలి, లెక్కించలేని పరిస్థితి ఏర్పడితే, రిటర్నింగ్ అధికారి రీపోలింగ్ జరిపించే విషయమై నిర్ణయం తీసుకుంటారని అన్నారు.