Vijay Sai Reddy: ఏపీలోని ప్రతి ఆడపిల్ల, ప్రతి స్త్రీకి సంబంధించిన సమాచారం టీడీపీ వద్ద ఉంది: విజయసాయిరెడ్డి
- ఇ-ప్రగతిని ఆధార్ కు లింక్ చేశారు
- ఎన్నికల ముందు వరకు ఎంతో కీలక సమాచారం రాబట్టారు
- ఆఖరికి ఐఎంఈఐ నంబర్ కూడా తీసుకున్నారు
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్ల, ప్రతి స్త్రీకి సంబంధించిన సమాచారం ఇవాళ టీడీపీ వద్ద ఉందని, ప్రతి కుటుంబానికి సంబంధించిన ఎంతో కీలకమైన సమాచారాన్ని టీడీపీ, చంద్రబాబు కలిసి దొంగిలించారని మండిపడ్డారు. ఆ సమాచారం టీడీపీ వద్దే కాకుండా, ఆ పార్టీ గూండాల వద్ద కూడా ఉందని అన్నారు.
ఆడపిల్లల, స్త్రీల ఫోన్ నెంబర్లు, వాళ్లు పెళ్లయినవాళ్లా, పెళ్లికాని వాళ్లా, వాళ్ల బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ కార్డు వివరాలు చంద్రబాబునాయుడు దొంగల ముఠా వద్ద ఉన్నాయని వివరించారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఇ-ప్రగతి పోర్టల్ ను ఆధార్ కు లింక్ చేయడం ద్వారా ఎంతో సమాచారాన్ని రాబట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. జె.సత్యనారాయణ 2106లో ఆధార్ సంస్థ చైర్మన్ గా నియమితులైనప్పటి నుంచి ఎన్నికల వరకు కూడా ఈ తంతు నిరాటంకంగా కొనసాగిందని ఆరోపించారు.
ఆధార్ నమోదులో ఎంతో కీలకంగా భావించే ఫింగర్ ప్రింట్స్, రెటీనా స్కాన్ వంటి ఇ-డేటాను ఇ-ప్రగతి పోర్టల్ కు బదిలీ చేసుకుని, దాని క్యారక్టరైజేషన్ ను ఓ సాఫ్ట్ వేర్ ద్వారా డేటా రూపంలోకి మార్చుకున్నారని విజయసాయి వెల్లడించారు. ఆ విధంగా ఇ-ప్రగతిలోకి ఆధార్ డేటాను రాబట్టిన చంద్రబాబు దొంగలముఠా అక్కడ్నించి పార్టీ యాప్ సేవామిత్రలోకి దాన్ని బదలాయించిందని ఆరోపించారు. దాదాపు 6 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన, ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించిన వివరాలను చంద్రబాబు తన పార్టీ యాప్ లో పెట్టుకోవడం అందరూ గమనించాలని అన్నారు.
ఇది ఎవరి చేతుల్లో ఉందన్న విషయంపై విచారణ జరగాలని విజయసాయి డిమాండ్ చేశారు. ఈ సేవామిత్రను రూపొందించింది ఐటీ గ్రిడ్స్ అని, ఐటీ గ్రిడ్స్ యజమాని అశోక్ దాకవరంను పట్టుకునేందుకు తెలంగాణ సర్కారు ఇప్పటికీ ప్రయత్నిస్తోందని తెలిపారు.
మొబైల్ ఫోన్ లొకేషన్ ద్వారా, మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తుల నంబర్ల ద్వారా సేవామిత్ర ప్రతి ఒక్కరినీ ట్రాక్ చేయగలదని అన్నారు. ఆఖరికి ఆ సంస్థ వ్యక్తుల నుంచి ఐఎంఈఐ నంబర్ తీసుకోవడం ద్వారా సిమ్ కార్డు మార్చుకున్నా ప్రతి వ్యక్తిని ట్రాక్ చేయడం వీలవుతుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఫోన్ లో ఉన్న మైక్ ను కూడా తమ అదుపులోకి తీసుకుని ఇతరుల సంభాషణను రికార్డు చేసే వీలుందని వివరించారు.
ఈ విధంగా చంద్రబాబునాయుడు ఐటీ గ్రిడ్స్ అశోక్ తో కలిసి దేశానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్పు తీసుకువచ్చాడో అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి, కొత్త నంబర్ల నుంచి ఫోన్ కాల్ వస్తే అది చంద్రబాబునాయుడు ముఠా దొంగిలించిన సమాచారం ఆధారంగా జరిగే మోసంగా అందరూ భావించాల్సిన పరిస్థితి ఉందని విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.