CBI: శారదా చిట్ ఫండ్ స్కాంలో రాజీవ్ కుమార్ పాత్రకు ఆధారాలు చూపండి, స్టేను వాపసు తీసుకుంటాం: సీబీఐకి సుప్రీం మెలిక
- బుధవారం లోపు అఫిడవిట్ దాఖలు చేయండి
- రాజీవ్ కుమార్ ఆధారాలను ఏవిధంగా మాయం చేశారో రుజువు చేయాలి
- ఆయన అరెస్ట్ దర్యాప్తు కోసమే అని నిరూపించుకోవాలి
కొన్నాళ్ల క్రితం కోల్ కతా పోలీస్ కమిషనర్ గా వ్యవహరించిన రాజీవ్ కుమార్ కార్యాలయంలో సీబీఐ సోదాలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. శారదా చిట్ ఫండ్ స్కాం నేపథ్యంలో జరిగిన ఈ పరిణామంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని తీవ్రస్థాయిలో నిందించారు. అప్పటినుంచి రాజీవ్ కుమార్ ను తమ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ సుప్రీం కోర్టులో ఎడతెగని పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో, రాజీవ్ అరెస్ట్ పై సుప్రీం స్టే ఇచ్చింది. దీన్ని సీబీఐ మరోసారి సవాల్ చేయడంతో, సుప్రీం ఓ మెలిక పెట్టింది.
శారదా చిట్ ఫండ్ స్కాంలో రాజీవ్ కుమార్ పాత్ర ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు సమర్పించాలని స్పష్టం చేసింది. చిట్ ఫండ్ స్కాం ఆధారాలు మాయం చేయడంలో రాజీవ్ కుమార్ పాత్ర ఏంటో నిరూపిస్తే అప్పుడు తాము గతంలో ఇచ్చిన స్టేను వాపసు తీసుకుంటామని సుప్రీం కోర్టు సీబీఐకి తేల్చిచెప్పింది.
"బుధవారం లోపు అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలి. రాజీవ్ కుమార్ తన అధికారంతో సమాచారాన్ని ఎలా దాచిపెట్టారో ఆధారాలతో రుజువు చేయాలి. రాజీవ్ కుమార్ అరెస్ట్ వెనుక రాజకీయ కోణం లేదు, కేవలం దర్యాప్తు కోసమే అని నిరూపించుకోవాలి" అంటూ సుప్రీం ధర్మాసనం కరాఖండీగా చెప్పింది.