Revanth Reddy: సీఎం భరోసా కల్పిస్తే ఆత్మహత్యలు తగ్గేవి: రేవంత్ రెడ్డి
- విద్యార్థులపై రూ.10 వేల కోట్ల వ్యాపారం
- వ్యక్తిగత సమాచారాన్ని ఎలా ఇస్తారు?
- ఇంటర్ బోర్డునే తీసేయాలని కుట్ర
సీఎం కేసీఆర్ బయటకు వచ్చి భరోసా కల్పించేలా ఓ ప్రకటన చేసి ఉంటే విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడేదని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన ఓ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, తెలంగాణలో విద్యార్థులపై రూ.10 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని ఆరోపించారు. 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఒక వ్యక్తి చేతికి ఎలా ఇస్తారని నిలదీశారు.
ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వమే రాచబాట వేస్తోందన్నారు. కార్పొరేట్ యాజమాన్యాలకు లబ్ది చేకూర్చే యత్నంలో భాగంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని రేవంత్ విమర్శించారు. ఇంటర్ బోర్డునే తీసేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్య తీసుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు.