spy reddy: హ్యాట్రిక్ ఎంపీ ప్రస్థానం.. మొదలైంది బీజేపీతోనే
- 1991లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి
- 2004 నుంచి వరుస విజయాలు
- రెండు ఓటముల తర్వాత తొలి విజయం
నంద్యాల ఎంపీ, జనసేన నేత ఎస్పీవై రెడ్డి గత రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జూన్ 4, 1950న కడప జిల్లా అంకాలమ్మ గూడూరులో జన్మించారు. వరంగల్ నిట్‌లో ఇంజినీరింగ్ చేసిన రెడ్డి ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. 1977లో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్లాస్టిక్ కంటెయినర్ల ప్లాంటును నెలకొల్పారు. 1984లో నంది పీవీసీ పైపుల కంపెనీ ఏర్పాటు చేసి విశేష గుర్తింపు పొందారు.
ఎస్పీవై రెడ్డి రాజకీయ ప్రస్థానం బీజేపీతో ప్రారంభమైంది. 1991లో బీజేపీ తరపున పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. 1999లో నంద్యాల, గిద్దలూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి రెండింటిలోనూ స్వల్ప ఓట్ల తేడాతో ఓడారు. 2000లో నంద్యాల మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎస్పీవై విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు.