Japan: జపాన్ కొత్త చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరించిన నరుహితో
- 126వ చక్రవర్తిగా నరుహితో
- సింహాసనాన్ని దిగిన అకిహితో
- నేడు శాస్త్రోక్తంగా సింహాసనంపైకి నరుహితో
జపాన్ 126వ చక్రవర్తిగా నరుహితో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ చక్రవర్తిగా ఉన్న నరుహితో తండ్రి అకిహితో (85) సింహాసనం నుంచి దిగిపోయిన నేపథ్యంలో ఆయన వారసుడిగా నరుహితో తదుపరి చక్రవర్తి అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన రాజ్యంగా పేరున్న జపాన్ లో మంగళవారం ఆయనకు చక్రవర్తిగా బాధ్యతలు అప్పగించారు. నరుహితో నేడు శాస్త్రోక్తంగా సింహాసనాన్ని అధిష్ఠించనున్నారు.
కొత్త చక్రవర్తిగా నరుహితో బాధ్యతలు స్వీకరించడంతో జపాన్ లో రీవా (అందమైన సామరస్యం అని జపాన్ భాషలో అర్థం) శకం ప్రారంభమైందని అధికారులు ప్రకటించారు. ఆయన చక్రవర్తిగా ఉన్నంత కాలమూ రీవా శకం కొనసాగుతుంది. ఒక చక్రవర్తి తనంతట తానుగా పదవి నుంచి తప్పుకోవడం గడచిన 200 సంవత్సరాల్లో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
జపాన్ కు చక్రవర్తిగా ఉన్న అకిహితో, 30 సంవత్సరాలపాటు పదవిలో ఉన్నారు. ఇక ఆయన అధికారంలో ఉన్న ఆఖరి రోజు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జపాన్ లో రాచరిక వ్యవస్థను వ్యతిరేకించే వర్గం ఈ సందర్భంగా పలుచోట్ల నిరసనలకు దిగింది.