Sri Lanka: ముస్లిం మహిళల బుర్ఖాలతో జాతీయ భద్రతకు ముప్పు... శ్రీలంకలా నిర్ణయం తీసుకోవాలని శివసేన డిమాండ్!
- శ్రీలంకలో బుర్ఖాలపై నిషేధం
- మోదీ ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి
- దేశ ప్రజల భద్రతకోసమేనన్న శివసేన
ముస్లిం మహిళలు తమ ముఖం కనిపించకుండా కట్టుకునే బుర్ఖాలను శ్రీలంకలో నిషేధించినట్టుగానే, ఇండియాలోనూ నిషేధించాలని శివసేన డిమాండ్ చేసింది. బుర్ఖాలు జాతీయ భద్రతకు విఘాతం కలిగించే అవకాశాలు ఉన్నాయని తమ అధికార పత్రిక 'సామ్నా'లో ప్రస్తావించిన శివసేన, ఇండియాలో బుర్ఖాలను నిషేధించాలని కోరింది. ఎన్నో దేశాలు ఇప్పటికే ముఖాన్ని పూర్తిగా కప్పుకోవడాన్ని నిషేధించాయని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడింది.
ఇదే సమయంలో బుర్ఖాను నిషేధించే నిర్ణయం తీసుకోవాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై సర్జికల్ దాడికి వెళ్లినప్పుడు చూపినంత గుండెధైర్యాన్ని మోదీ చూపాల్సి వుంటుందని వెల్లడించింది. అయితే, ఈ నిర్ణయం అసాధ్యమైనదేమీ కాదని, కొంత ధైర్యంగా వ్యవహరిస్తే, ప్రజలు సైతం బుర్ఖా నిషేధాన్ని హర్షిస్తారని పేర్కొంది. జాతి భద్రతకు విఘాతంగా మారిన వారు తమను గుర్తు పట్టకుండా బుర్ఖా మాటున దాగే అవకాశాలు పుష్కలమని, ఆ అవకాశం వారికి లేకుండా చేస్తే, దాడులు తగ్గుతాయని తెలిపింది. దేశ ప్రజల భద్రత కోసం మోదీ ధైర్యాన్ని ప్రదర్శించాలని 'సామ్నా' తన సంపాదకీయంలో సూచించింది.