Crime News: సవతి తల్లిని నరికి చంపిన కానిస్టేబుల్... ఆస్తి కోసం ఘాతుకం!
- కొడవలితో దాడి చేయడంతో అక్కడికక్కడే దుర్మరణం
- తొలుత తల్లీకూతుర్ల కళ్లలో కారం చల్లిన నిందితుడు
- హత్యచేసిన వ్యక్తి ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్
అతనో బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగి. నేరాలు జరిగితే అడ్డుకోవాల్సిన కానిస్టేబుల్. కానీ ఆస్తి కోసం తానే హత్యకు పాల్పడ్డాడు. అదీ సవతి తల్లినే ఘోరంగా నరికి చంపాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ దారుణం హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానికుల కథనం మేరకు...కుర్మగూడ డివిజన్ మాదన్నపేట బోయబస్తీకి చెందిన యాదయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కొడుకు శ్రీకాంత్ ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్. గోషామహల్ బెటాలియన్‌లో పని చేస్తున్నాడు. యాదయ్య రెండో భార్య సుకన్య. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. యాదయ్య బతికుండగానే శ్రీకాంత్ పేరున బీహెచ్ఈఎల్, మాదన్నపేటలో రెండిళ్లను రాశాడు. వీటి విలువ కోట్లలో ఉంటుందని స్థానికులు చెపుతున్నారు. అలాగే, రెండో భార్య సుకన్య పేరున కొంత ఆస్తి రాశాడు.
రెండు నెలల క్రితం యాదయ్య చనిపోవడంతో అప్పటి నుంచి ఆస్తి కోసం శ్రీకాంత్ గొడవ మొదలు పెట్టాడు. సుకన్య పేరున ఉన్న ఆస్తి కూడా తనకే చెందుతుందంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. తండ్రి చనిపోయినప్పుడే ఆస్తికోసం గొడవ చేస్తే స్థానికులు నచ్చచెప్పి పంపించారు. దీంతో భయపడిన సుకన్య ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంది. ఇది తెలిసిన శ్రీకాంత్ సుకన్య ఇంటికి వెళ్లి వాటిని ధ్వంసం చేశాడు. దీంతో భయపడిన సుకన్య ధ్వంసం చేసిన సీసీ కెమెరాల స్థానంలో కొత్తగా మళ్లీ ఏర్పాటు చేయించుకుంది. ఈ విషయం శ్రీకాంత్‌కు తెలియదు.
మంగళవారం ఉదయం మాదన్నపేటలో ఉంటున్న సుకన్య ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ ఇంట్లో ఉన్న సుకన్య, చెల్లెళ్ల (సుకన్య కుమార్తెలు) కళ్లలో ముందు కారం చల్లాడు. వారు తేరుకునేలోగానే తనతో తెచ్చిన కొడవలితో సుకన్యను నరికి చంపాడు. ఈ ఘటనలో సుకన్య అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కూతుర్లు షాక్ కు లోనయ్యారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలిని సందర్శించారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా మొత్తం ఘటన అంతా రికార్డయి ఉంది. దీంతో పుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడు శ్రీకాంత్‌ను పట్టుకునేందుకు రెండు బృందాలను రంగంలోకి దించారు. ఈ సంఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించడంతో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.