modi: మోదీపై పోటీ చేస్తున్న మాజీ సైనికుడికి ఈసీ నోటీసులు
- జవాన్లు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారన్న తేజ్ బహదూర్
- 2017లో సర్వీసుల నుంచి తొలగింపు
- వివరణ ఇవ్వాలని కోరిన ఈసీ
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానంలో ప్రధాని మోదీపై సమాజ్ వాదీ పార్టీ తరపున మాజీ సైనికుడు తేజ్ బహదూర్ యాదవ్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ఈసీ నోటీసులు జారీ చేసింది. జవాన్లకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆరోపించిన తేజ్ బహదూర్ సంచలనాన్ని రేకెత్తించాడు. ఈ నేపథ్యంలో, ఆయనను సర్వీసు నుంచి తొలగించారు.
ఈ క్రమంలో, తేజ్ బహదూర్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. అవినీతి కారణంగా కానీ, దేశాన్ని అగౌరవ పరచడం ద్వారా కానీ సర్వీసుల నుంచి తొలగింపబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్ల పాటు ప్రచారంలో పాల్గొనకూడదని తన లేఖలో తెలిపింది. దీనికి సంబంధించి మే 1లోగా వివరణ ఇవ్వాలని కోరింది. తేజ్ బహదూర్ ఇచ్చే సమాధానాన్ని బట్టి అతని నామినేషన్ ను ఆమోదించడం కానీ, తిరస్కరించడం కానీ చేస్తారు. 2017 ఏప్రిల్ లో ఆయనను సర్వీసుల నుంచి తొలగించారు.