Puduchcherry: తండ్రికి ట్యూషన్ చెప్పి, టెన్త్ పాస్ చేయించిన కుమార్తె!
- పుదుచ్చేరిలో ఘటన
- ప్రమోషన్ కోసం టెన్త్ రాసిన ప్రభుత్వోద్యోగి
- ఫెయిలైన సబ్జెక్టుల్లో కుమార్తె ట్యూషన్
ఎదిగొచ్చిన బిడ్డ ఉంటే ఎంత లాభమో ఆ తండ్రికి తెలిసొచ్చింది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలంటే, పదో తరగతి పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాల్సిన ఓ తండ్రి, తన కుమార్తె ఇచ్చిన శిక్షణతో పరీక్ష పాసై, ఆ ఆనందాన్ని ఇప్పుడు అందరితో పంచుకుంటున్నారు. ఈ ఘటన పుదుచ్చేరిలోని కూడపాక్కం ప్రాంతంలో జరిగింది. 7వ తరగతి వరకూ మాత్రమే చదువుకున్న సుబ్రహ్మణ్యం (45) ప్రభుత్వ ఉద్యోగమైతే సంపాదించుకున్నాడు గానీ, ప్రమోషన్ మాత్రం పొందలేకపోయాడు.
ప్రమోషన్ కోసం మరింత చదవాలని భావించిన ఆయన 2017లో ఎనిమిదో తరగతి పాస్ అయ్యాడు. ఆపై టెన్త్ రాయగా, మూడు సబ్జెక్టులు పోయాయి. ఆపై సప్లిమెంటరీ రాస్తే, రెండు సబ్జెక్టులు మిగిలాయి. ఇక తనకు చదువు అచ్చిరాదనుకున్న ఆయనకు, కుమార్తె రూపంలో వరం లభించింది. సుబ్రహ్మణ్యం కుమార్తె త్రిగుణ పదో తరగతి చదువుకుంటూ, తండ్రి పాస్ కావాల్సిన ఆంగ్లం, గణితంలో ఇంట్లోనే ట్యూషన్ చెప్పింది. ఆపై కుమార్తెతో కలిసి సుబ్రహ్మణ్యం కూడా పరీక్ష రాశారు. సోమవారం నాడు ఫలితాలు రాగా, ఇద్దరూ ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడా తండ్రీ బిడ్డలను పలువురు అభినందిస్తున్నారు.