Telangana: బుర్ఖాను నిషేధించాలన్న శివసేన డిమాండ్ పై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ!
- శివసేన మత విద్వేషాలను రెచ్చగొట్టింది
- ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే
- బీజేపీ, శివసేన భారత విలువల్ని అర్థం చేసుకోలేవు
భారత్ లోని బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం మహిళలు బుర్ఖా ధరించకుండా నిషేధం విధించాలని శివసేన పార్టీ డిమాండ్ చేయడంపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో శివసేన వారి భాషనే మాట్లాడుతోందని మండిపడ్డారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం ద్వారా శివసేన ఎన్నికల కోడ్ ను స్పష్టంగా ఉల్లంఘించిందని అన్నారు. కాబట్టి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో ఒవైసీ మాట్లాడారు. విదేశాల్లో అక్కడి ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటున్నాయన్న విషయం తనకు అనవసరమనీ, తాను భారతీయుడినని ఒవైసీ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తామని తేల్చిచెప్పారు. శివసేన వ్యాఖ్యలు పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.
ముస్లిం మహిళలపై దేశమంతా విద్వేషం రెచ్చగొట్టేందుకు శివసేన నేతలు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా భారత్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలని బీజేపీ, శివసేన నేతలకు ఆయన హితవు పలికారు. శివసేన, బీజేపీ నేతలు భారతీయ విలువలను ఎన్నటికీ అర్థం చేసుకోలేరని స్పష్టం చేశారు. ఇటీవల శ్రీలంకలో ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలను నిషేధించింది. దీంతో భారత్ లోనూ ఇదే చర్య తీసుకోవాలని శివసేన కేంద్రాన్ని డిమాండ్ చేసింది.