BJP: బీజేపీ గొప్పలు పోతోంది కానీ, పరిస్థితి చూస్తే అలా కనిపించడంలేదు: సీతారాం ఏచూరి
- గతంతో పోలిస్తే సగం సీట్లు గెలిచినా గొప్పే!
- ఎన్డీయేలో మరిన్ని పార్టీలను చేర్చుకుంటేనే మళ్లీ అధికారం
- రాహుల్ వామపక్షాలపై పోటీచేయడం దురదృష్టకరం
ప్రస్తుత లోక్ సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ భ్రమల్లో ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంటున్నారు. 69 శాతం స్థానాల్లో గెలిస్తే అధికారం మళ్లీ చేజిక్కుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారని, కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. మూడు, నాలుగో విడతల ఎన్నికల్లో బీజేపీ 130 మంది సిట్టింగ్ ఎంపీలకు మాత్రమే అవకాశం ఇచ్చిందని, వాళ్లలో గెలిచేవాళ్లు సగం మంది కూడా లేరని ఏచూరి అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో గెలిచిన సీట్లలో ఈసారి సగం గెలిచినా గొప్పేనని అన్నారు.
ఈసారి కూడా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ, ఎన్డీయేలో మరిన్ని పార్టీలను చేర్చుకుంటే తప్ప వారు కోరుకుంటున్న అధికారం దక్కదని ఈ వామపక్ష నేత విశ్లేషించారు. దేశ రాజకీయాల్లో హంగ్ సాధారణం అయిపోయిందని, ఇప్పుడు కూడా హంగ్ వస్తుందని స్పష్టం చేశారు. తమ మద్దతు ఎప్పుడూ లౌకికవాద ప్రభుత్వానికే ఉంటుందని తమ బీజేపీ వ్యతిరేకతను నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు.
పార్లమెంటులో వామపక్షాల అభిప్రాయాలకు ఎప్పుడూ విలువ ఉంటుందని, అప్పట్లో తమ సూచనల కారణంగానే యూపీఏ హయాంలో ఆర్టీఐ, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ పథకాలు ఊపిరి పోసుకున్నాయని వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వాయనాడ్ లో వామపక్షాల అభ్యర్థిపై పోటీచేయడం విచారకరం అని ఏచూరి అభిప్రాయపడ్డారు. బీజేపీపై పోటీ చేయకుండా వామపక్షాలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. గతంలో సోనియాను కర్ణాటక నుంచి పోటీచేయాల్సిందిగా తానే సలహా ఇచ్చానని, కానీ రాహుల్ విషయం దురదృష్టకరం అని అన్నారు.