Galla Jaydev: సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోతే ఈవీఎంల పరిస్థితి ఏంటి?: గల్లా జయదేవ్ ఆందోళన
- ఈవీఎంల భద్రతపై గుంటూరు ఎంపీ సందేహాలు
- ఈసీది పక్షపాత ధోరణి
- ఎన్నికల కోడ్ ఏపీలో భిన్నంగా అమలవుతోంది
టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈవీఎంల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఇవాళ గుంటూరు జిల్లాలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. అయితే, అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోతే పరిస్థితి ఏంటని అనుమానం వ్యక్తం చేశారు.
ఒకవేళ అక్కడ పర్యవేక్షణ లోపం తలెత్తితే ఏం జరుగుతుంది? ఈవీఎంలను ఎవరైనా బయటికి తీసుకెళ్లే అవకాశం ఉంది కదా? అని సందేహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా, ఈసీ వ్యవహార సరళిపైనా గల్లా వ్యాఖ్యలు చేశారు. ఈసీ ఏపీకో న్యాయం, తెలంగాణకో న్యాయం అమలు చేస్తోందని అన్నారు. సమీక్ష సమావేశాల విషయంలో ఈసీది పక్షపాత ధోరణి అని ఆరోపించారు. ఎన్నికల కోడ్ దేశం మొత్తం అమలు జరుగుతున్నా, ఒక్క ఏపీలో మాత్రం భిన్నంగా అమలవుతోందని ఎద్దేవా చేశారు.