Assange: వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకి 50 వారాల జైలుశిక్ష
- బెయిల్ దుర్వినియోగం చేసినందుకు శిక్ష
- తమ క్లయింటు నిరాశలో కూరుకుపోయాడన్న న్యాయవాది
- వృథా అయిన ప్రజాధనం మాటేమిటన్న జడ్జి
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు లండన్ సౌత్ వార్క్ క్రౌన్ న్యాయస్థానం 50 వారాల జైలుశిక్ష విధించింది. బెయిల్ పై బయటికొచ్చినా పోలీసుల ఎదుట హాజరుకాకుండా తప్పించుకున్నందుకు ఈ శిక్ష విధించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజే గతంలో ఓసారి అరెస్ట్ అయి బెయిల్ పై బయటికొచ్చారు. కానీ నిర్ణీత గడువులోపల పోలీసుల ఎదుట హాజరుకాకుండా ఈక్వెడార్ ను శరణుజొచ్చి లండన్ లోని వారి దౌత్య కార్యాలయంలో ఏడేళ్లపాటు ఆశ్రయం పొందారు.
ఇటీవలే ఈక్వెడార్ అసాంజేకి ఆశ్రయాన్ని వెనక్కి తీసుకోవడంతో అతడిని పోలీసులు బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. కాగా, కోర్టులో విచారణ సందర్భంగా, తమ క్లయింటు ఎంతో నిరాశలో కూరుకుపోయి ఉండడం వల్ల తిరిగి పోలీసుల ఎదుట హాజరుకాలేకపోయాడంటూ అసాంజే తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
అయితే, న్యాయమూర్తి డెబొరా టేలర్ ఇదేమీ పట్టించుకోకుండా, అసాంజే ఈ ఏడేళ్లపాటు ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకున్నందువల్ల 21 మిలియన్ డాలర్ల ప్రజాధనం వృథా అయిందని, దానికేం బదులు చెబుతారంటూ ప్రశ్నించారు. కాగా, విచారణ అనంతరం అసాంజే బయటికి వస్తుండగా, కొందరు 'నీ పట్ల సిగ్గుపడుతున్నాం' అంటూ నినాదాలు చేయగా, మరికొందరు 'అసాంజే స్వేచ్ఛే మా స్వేచ్ఛ' అంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు.