Andhra Pradesh: ఫణి భయంతో వణుకుతున్న తీర ప్రాంత ప్రజలు.. హెచ్చరికలు జారీ చేసిన ఆర్టీజీఎస్
- భీమిలి, విశాఖపట్టణంలో ప్రమాదకరంగా సముద్రం
- ఆరు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్న అలలు
- అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ
పెను తుపానుగా మారిన ‘ఫణి’ ఏపీలోని తీర ప్రాంతాలను భయపెడుతోంది. తుపాను ధాటికి ఉత్తరాంధ్రలో సముద్రం అల్లకల్లోలంగా మారగా, చాలా ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. భీమిలి, విశాఖపట్టణం బీచ్‌ల వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. 4 నుంచి ఆరు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. తుపాను క్రమంగా తీరంవైపు దూసుకొస్తుండడంతో రియల్ టైమ్ గవర్నెన్స్ స్టాండీ (ఆర్టీజీఎస్) అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజలు ఎవరూ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, సెల్ఫీలు తీసుకోవద్దని కోరారు. సర్వైలెన్స్ కెమెరాలతో తీర ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్.. అధికారులను అప్రమత్తం చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని గార, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం మండలాలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాలపై ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాగా, తీవ్ర తుపానుగా మారిన ఫణి పూరి వద్ద తీరం దాటిన అనంతరం తీరం వెంబడి పయనించి పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తుందని అంచనా వేస్తున్నారు.