Facebook: కొత్త రూపంలో ఫేస్ బుక్... సీక్రెట్ క్రష్ కూడా!
- ఫేస్ బుక్ కొత్త లుక్ పేరు 'ఎఫ్బీ5'
- మరిన్ని దేశాలకు వాట్స్ యాప్ పేమెంట్ సేవలు
- వార్షిక సాంకేతిక సదస్సులో మార్క్ జుకర్ బర్గ్
సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్, సరికొత్త లుక్ తో కనిపించనుంది. ప్రతియేటా నిర్వహించే వార్షిక సాంకేతిక సదస్సు, ఈ సంవత్సరం 'ఎఫ్8' పేరిట జరుగగా, ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఈ కొత్త ఫేస్ బుక్ డిజైన్ ను 'ఎఫ్బీ5'గా వ్యవహరించనున్నట్టు తెలిపారు.
యూజర్లు మరింత సులువుగా, స్పీడ్ గా ఫేస్ బుక్ ను వాడుకునేలా ఈ ఫీచర్ ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా విడుదల చేస్తామని, డెస్క్ టాప్ సైట్లకూ మారుస్తామని మార్క్ తెలిపారు. ఫేస్ బుక్ అందించే డేటింగ్ సేవల్లో సీక్రెట్ క్రష్ పేరిట కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుందని, ఇది తమ యూజర్లకు ఎంతో నచ్చుతుందని భావిస్తున్నానని అన్నారు.
మెసింజర్ యాప్ ను మరింత తేలికగా మార్చాలని నిర్ణయించామని, ఇండియాలో తాము పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన వాట్స్ యాప్ పేమెంట్ ఫీచర్ ను డిసెంబర్ నాటికి మరికొన్ని దేశాల్లో ప్రవేశపెడతామని అన్నారు. డేటా ప్రైవసీ, యూజర్ల సమాచారం భద్రతపై దృష్టిని సారించామని అన్నారు.