Andhra Pradesh: ఎల్వీ సుబ్రహ్మణ్యం నియామకాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు!: ఐవైఆర్ కృష్ణారావు
- ప్రధానిని ఢీకొట్టాల్సిన స్థాయి చంద్రబాబుది
- ఆయన సీఎస్ ను ఢీకొట్టాలని చూస్తున్నారు
- సుబ్రహ్మణ్యం ఓ సాధారణ అధికారి మాత్రమే
ఎన్నికల సంఘం నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి సహా టీడీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఎల్వీ సుబ్రహ్మణ్యం పరిధిదాటి వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సైతం వ్యాఖ్యానించారు. టీటీడీ బంగారం విషయంలో సీఎస్ అతిగా స్పందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.
ప్రధానమంత్రిని ఢీకొట్టాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి సీఎస్ తో ఢీకొట్టాలని చూడటం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. తన ప్రమేయం లేకుండా ఈసీ సీఎస్ ను నియమించడాన్ని బాబు తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
ఈరోజు ట్విట్టర్ లో ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ.. ‘ప్రధానమంత్రితో ఢీ కొట్టాల్సిన స్థాయిలో ఉన్న నేత సీఎస్ తో ఢీ కొట్టాలని చూడటం దురదృష్టకరం. ఆయన ఒక సాధారణ అధికారి. తన ప్రమేయం లేకుండా సీఎస్ నియామకాన్ని ముఖ్యమంత్రి గారు జీర్ణించుకోలేకపోతున్నారు. ట్రాక్ రికార్డు చూడాలంటే అందరు రాజకీయ నాయకులు అధికారుల రికార్డులు చూస్తే బాగానే ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.