pm: మోదీ, అమిత్ షాల ‘కోడ్’ ఉల్లంఘన.. ఈసీకి డెడ్ లైన్ విధించిన సుప్రీంకోర్టు
- ‘కోడ్’ ఉల్లంఘించేలా మోదీ, అమిత్ షా ప్రసంగాలు
- ఈసీ చర్యలు చేపట్టకపోవడంపై కాంగ్రెస్ పిటిషన్
- ఈ నెల 6లోపు నిర్ణయం తీసుకోవాలని ఈసీకి ఆదేశాలు
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు చేసిన ప్రసంగాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈసీ ఎటువంటి చర్యలు చేపట్ట లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోదీ, అమిత్ షాలపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఈసీకి డెడ్ లైన్ విధించింది. మోదీ, అమిత్ షాలపై వచ్చిన ఫిర్యాదులపై ఈ నెల 6లోపు నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈసీకి అందిన ఫిర్యాదుల్లో ఇప్పటికే రెండింటిపై నిర్ణయం తీసుకున్నామని, మరో 9 ఫిర్యాదులపై మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టుకు ఈసీ స్పష్టం చేసింది. ఆ ఫిర్యాదులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, అందుకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ ఆదివారం వరకు సమయం ఉన్నందున మిగిలిన ఫిర్యాదులపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచించిన సుప్రీంకోర్టు, ఈ కేసు విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది.