Narendra Modi: పాకిస్థాన్‌ను ఉద్దేశించి ప్రధాని చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదు: సీఈసీ
- ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించలేదని క్లీన్ చిట్
- ఇటీవల కాలంలో ఎన్నికల సంఘం ఇచ్చిన మూడో క్లీన్ చిట్ ఇది
- రాజస్థాన్ సభలో అణ్వాయుధాల గురించి దాయాదిని హెచ్చరించిన మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభల్లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ఫిర్యాదులు వస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఓ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. పాకిస్థాన్‌కు అణ్వాయుధాలతో జవాబిస్తామన్న వ్యాఖ్యల విషయంలో ప్రధాని ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించలేదని ఈసీ స్పష్టం చేసింది.
రాజస్థాన్‌లోని బార్మర్‌లో గత నెల 21వ తేదీన జరిగిన ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ ‘మా దగ్గర న్యూక్లియర్ బటన్ ఉందని పాకిస్థాన్ చెబుతోంది. మరి మన దగ్గరేముంది? భారత్ ఏమీ దీపావళి సంబరాల కోసం అణ్వాయుధాలు తయారు చేసి పెట్టుకోలేదు’ అని హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత్ అణ్వాయుధ సామర్థ్యం తెలుసుకాబట్టే పాకిస్థాన్ బెదిరించడం మానుకుందని, లేదంటే గతంలో నిత్యం అణ్వాయుధాలు ప్రయోగిస్తామంటూ బెదిరించిన విషయాన్ని గుర్తు చేశారు.
తాము ఇంట్లోకి చొరబడి ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం దాయాది దేశం గుర్తు చేసుకోవాలని సూచించారు. కాగా, ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత ఆయన ఎన్నికల ప్రవర్తన నియమాళి ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.
దీంతో ఎన్నికల సంఘం రాజస్థాన్ రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి నివేదిక కోరింది. దీంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రధాని మోదీ ప్రసంగానికి సంబంధించి పది పేజీల అనువాద పాఠాన్ని తయారు చేసి ఎన్నికల సంఘానికి అందించారు. ఈ ప్రసంగాన్ని పరిశీలించిన ఈసీ ప్రధాని వ్యాఖ్యల్లో తప్పేం లేదని స్పష్టం చేసింది.