Telangana: తెలంగాణలో నీటికి కటకట..కర్ణాటక ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన కేసీఆర్!
- జూరాల ప్రాజెక్టుకు 3 టీఎంసీల కోసం విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన సీఎం కుమారస్వామి
- 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఫోన్ చేశారు. జూరాల ప్రాజెక్టుకు సాగు, తాగునీటి అవసరాల కోసం 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కుమారస్వామి సానుకూలంగా స్పందించారు.
తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల విషయంలో రాబోయే 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో కేసీఆర్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నదిపై 1996లో నిర్మించిన జూరాల ప్రాజెక్టుతో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 9.68 టీఎంసీలు.