priyanka gandhi: ప్రియాంక గాంధీని ఎన్నికల బరిలోకి దించకపోవడానికి కారణాన్ని వివరించిన రాహుల్ గాంధీ
- వారణాసి నుంచి పోటీ చేయించాలనేది కార్యకర్తల అభిలాష
- అందరం చర్చించి ఆమెను పోటీ చేయించకూడదని నిర్ణయించాం
- పార్టీ పరంగా ప్రియాంకకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి
ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సోదరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల బరిలోకి ఆమె దిగలేదు. ఈ అంశానికి సంబంధించి రాహుల్ క్లారిటీ ఇచ్చారు.
వారణాసి నుంచి ప్రియాంకను పోటీ చేయించాలనేది పార్టీ కార్యకర్తల కోరికని రాహుల్ చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందే పలువురు నేతలు కూడా ఇదే అంశాన్ని తన వద్ద ప్రస్తావించారని తెలిపారు. అయితే, అందరం కలసి చర్చించుకున్న తర్వాత, వారణాసి నుంచి ఆమెను బరిలోకి దించరాదనే నిర్ణయానికి వచ్చామని, తమ నిర్ణయానుసారమే ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. అయితే, ఈ విషయాన్ని చివరి వరకు సస్పెన్స్ గా ఉంచాలనుకున్నామని, అలాగే చేశామని తెలిపారు. పార్టీలో ప్రియాంకకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని... వారణాసిలో పోటీ చేయడం కంటే అవి ముఖ్యమైనవని అన్నారు.