Chandrababu: ఫణి విషయంలో ఆర్టీజీఎస్ చెప్పిందే నిజమైంది: చంద్రబాబు
- ముందు చెప్పినట్టుగా ఫణి పూరీ వద్దే తీరం దాటింది
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి
- ఆహారం, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నాం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఫణి తుపాను తాజా పరిస్థితిపై స్పందించారు. తీవ్ర పెనుతుపానుగా మారిన ఫణి ఒడిశాలో తీరం దాటడంపై ఆయన ట్వీట్లు చేశారు. ఆర్టీజీఎస్ అంచనాలు ఎక్కడా తప్పకుండా ఫణి తుపాను పూరీ వద్దే తీరం దాటిందని స్పష్టం చేశారు. ఒడిశాలోనీ పూరీ సమీపంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల మధ్య ఫణి తీరాన్ని దాటిందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాను గమనాన్ని ఆర్టీజీఎస్ మెరుగైన రీతిలో అంచనా వేసిందని కితాబిచ్చారు.
ప్రస్తుతం ఏపీలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయని తెలిపారు. తుపాను కారణంగా విలయానికి గురైన ప్రాంతాల్లో అత్యవసరాలైన ఆహారం, తాగునీటి సౌకర్యాలతో పాటు సెల్ ఫోన్ చార్జింగ్ యూనిట్లు అందుబాటులోకి తీసుకువస్తున్నామని, కూలిపోయిన వృక్షాలు, విద్యుత్ స్థంభాలు తొలగించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు.