Rahul Gandhi: ఢిల్లీలో రాహుల్ గాంధీ పుట్టగానే మొదట ఎత్తుకున్నది నేనే... కేరళ నర్సు కీలకవ్యాఖ్యలు
- రాహుల్ భారతీయుడే
- ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో జన్మించారు
- ఆసక్తికర సమాచారం వెల్లడించిన రాజమ్మ వవాతిల్
లోక్ సభ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతీయతపై ఎన్నడూలేని విధంగా ఆరోపణలు వస్తుండడం తెలిసిందే. రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని, ఆయన పేరు రావుల్ విన్సీ అని ప్రత్యర్థులు విమర్శల దాడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళకు చెందిన రాజమ్మ వవాతిల్ అనే విశ్రాంత నర్సు ఆసక్తికరమైన సమాచారం అందించారు.
72 ఏళ్ల రాజమ్మ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో నర్సుగా పనిచేశారు. ఆపై భారత సైన్యంలో నర్సుగా సేవలు అందించి రిటైరయ్యారు. పదవీ విరమణ తర్వాత కేరళ వచ్చి కల్లూరులో నివాసం ఉంటున్నారు. రాహుల్ జాతీయతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాజమ్మ మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో తాను ట్రయినీ నర్సుగా ఉన్న సమయంలోనే సోనియా గాంధీ ప్రసవం కోసం వచ్చారని తెలిపారు. డెలివరీ రూమ్ బయట ఆమె భర్త రాజీవ్ గాంధీ, ఆయన సోదరుడు సంజయ్ గాంధీ ఎంతో ఆదుర్దాగా కనిపించారని, రాహుల్ పుట్టగానే ఎత్తుకున్న వాళ్లలో తాను కూడా ఉన్నానని రాజమ్మ వెల్లడించారు.
రాహుల్ గాంధీ భారత పౌరుడే అని చెప్పడానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలని ఆమె ప్రశ్నించారు. పుట్టినప్పుడు రాహుల్ గాంధీ ఎంతో ముద్దుగా ఉన్నాడని, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మనవడ్ని ఎత్తుకునే అదృష్టం తనకు దక్కడం పట్ల ఎంతో సంతోషించానని చెప్పారు. రాహుల్ వాయనాడ్ వస్తే ఆయనను తప్పకుండా కలుస్తానని రాజమ్మ తెలిపారు.