Telugudesam: బోనులో చేతులు కట్టుకుని నిలబడేవాళ్లు కూడా మాట్లాడుతున్నారు: వైసీపీ అగ్రనేతలపై సోమిరెడ్డి ఫైర్
- వైసీపీ నేతలకు చట్టాలు తెలియవు
- బురదజల్లడమే వారి పని
- ఏపీ ప్రభుత్వం రైతులకు చేసే మేలు చూసి సిగ్గుతో తలదించుకోవాలి
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎట్టకేలకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రకృతి వైపరీత్యాలు, కరవు, తుపాను నష్టాలపై ఆయన చర్చించారు. సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రతి శుక్రవారం కోర్టు బోనులో చేతులు కట్టుకుని నిలబడేవాళ్లు కూడా తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నేతలా మాకు చెప్పేది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లపై ఏడేసి కేసులున్నాయని అన్నారు. కనీసం ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, చట్టాలు కూడా తెలియని నేతలు వైసీపీ నేతలని విమర్శించారు. రాష్ట్రంలో మూడు రకాల పాలనకు అవకాశం ఉంటుందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాలన, ఆపద్ధర్మ పాలన, రాష్ట్రపతి పాలన ఉంటాయని, ఇవేవీ వైసీపీ నేతలకు తెలియవని ఎద్దేవా చేశారు.
రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతిదాన్ని సొమ్ము చేసుకోవడంపైనే వాళ్ల దృష్టి ఉండేదని, ఇప్పుడు తమపై బురదజల్లడమే ధ్యేయంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రైతులకు ఇచ్చే నిధులు తింటున్నామని ఆరోపిస్తున్న నేతలు, ఏపీ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలు చూసి సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయరంగంలో ప్రథమస్థానంలో ఉందని మంత్రి సోమిరెడ్డి స్పష్టం చేశారు.