Fani: పశ్చిమ బెంగాల్లో హైఅలర్ట్... ఇప్పటికీ ఫణిలో సగభాగం బంగాళాఖాతంలోనే!
- రేపు ఉదయం పశ్చిమ బెంగాల్ ను తాకనున్న ఫణి
- పాఠశాలలకు సెలవులు
- తీర ప్రాంతాలకు వెళ్లవద్దంటూ పర్యాటకులకు హెచ్చరిక
గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో తీవ్ర పెనుతుపానుగా తీరంపై విరుచుకుపడిన ఫణి ధాటికి ఒడిశా విలవిల్లాడుతుండగా, పొరుగునే ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బిక్కుబిక్కుమంటోంది. ఉదయం 10.30 గంటల సమయంలో పూరీ వద్ద తీరాన్ని తాకిన ఫణి ఆపై 11.30 గంటలకు పూర్తిగా భూభాగంపైకి చేరుకుంది. అక్కడినుంచి భువనేశ్వర్, భద్రక్ మీదుగా బాలాసోర్ పయనించి మళ్లీ పాక్షికంగా సముద్రంలో ప్రవేశించింది.
ప్రస్తుతం బాలాసోర్ వద్ద కేంద్రీకృతమైన ఫణిలో సగభాగం బంగాళాఖాతంలోనే ఉంది. ఈ కారణంగా, అది పూర్తిగా బలహీనపడుతుందని చెప్పలేమని వాతావరణ శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇది ఈశాన్యదిశగా పయనించి శనివారం ఉదయం పశ్చిమ బెంగాల్ ను తాకుతుందని అంచనా వేస్తున్నారు.
భారత వాతావరణ విభాగం హెచ్చరికలతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల సభలను కూడా రద్దుచేసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, కోల్ కతా, పశ్చిమ మిడ్నపూర్, ఉత్తర 24 పరగణాల జిల్లాలకు తుపాను ముప్పు ఉండొచ్చని భావిస్తున్నారు. హౌరా, హుగ్లీ, సుందర్ బన్, ఝూర్ గ్రామ్ జిల్లాల్లో కూడా ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. అనేక జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తీర ప్రాంతాలకు వెళ్లరాదని పర్యాటకులను బెంగాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ముమ్మరం చేశారు.