cyclone fani: ఒడిశాలో తుపాను బీభత్సం.. 8 మంది మృతి
- గాలిపటాలలా +ఎగిరిపోతున్న ఇంటిపైకప్పులు
- కూలుతున్న భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
- సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నం
ఉత్తరాంధ్ర జిల్లాలను వణికించి ఒడిశాకు తరలిపోయిన ఫణి తుపాను అక్కడ బీభత్సం చేస్తోంది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తుపాను కారణంగా ఇప్పటి వరకు 8 మంది మృత్యువాత పడ్డారు. తీవ్ర గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ హాస్టల్ పైకప్పు గాలిపటంలా ఎగిరిపోయింది. విద్యుత్ స్తంభాలు, టవర్లు కుప్పకూలాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి. ఇక, వేలాది హెక్టార్లలో పంట నీట మునిగింది. సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది.
తుపానుతో అప్రమత్తమైన రైల్వే కోల్‌కతా-చెన్నై మార్గంలో 220కిపైగా రైళ్లను రద్దు చేసింది. భువనేశ్వర్ విమానాశ్రయాన్ని మూసివేశారు. తుపాను ప్రభావం అసోంపైనా పడడంతో గువాహటి విమానాశ్రయంలో విమాన రాకపోకలను నిలిపివేశారు. 23 విమానాలను రద్దు చేశారు.