Chandrababu: నేటి నుంచి ఎన్నికల సమీక్షలు చేబడుతున్న చంద్రబాబు
- రోజుకి రెండు నియోజకవర్గాల చొప్పున ఈనెల 22 వరకు కొనసాగింపు
- రాజమండ్రి నియోజకవర్గం నుంచి ప్రారంభం
- పోలింగ్ సరళి, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సరళి, ఈనెల 23న జరగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు నుంచి సమీక్షలు చేపడుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా చేపట్టే ఈ సమీక్షలను రాజమండ్రి నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఉదయం, సాయంత్రం రోజుకి రెండు నియోజకవర్గాల చొప్పున ఈనెల 22వ తేదీ వరకు సమీక్షలు కొనసాగించనున్నారు.
విజయవాడ సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో జరిగే ఈ సమీక్షలో ముందుగా ఆయా అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడుతారు. ఆ తర్వాత ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి ఏడుగురు చొప్పున రప్పించిన 50 మంది సీబీఎన్ ఆర్మీతో పోలింగ్ సరళిపై చర్చిస్తారు. అనంతరం కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేస్తారు.