Telangana: రాళ్లదాడిపై స్పందించిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్!
- కొన్ని శక్తులు దీని వెనుక ఉన్నాయి
- ప్రజలంతా నా వెనుకే ఉన్నారు
- పగతో కొందరు నాపై దాడి చేయించారు
- మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ నేత
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఈరోజు టీఆర్ఎస్ నేత హరిప్రియా నాయక్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. హరిప్రియ ప్రచారాన్ని అడ్డుకోవడంతో టీఆర్ఎస్-కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువర్గాలు రాళ్లతో దాడిచేసుకున్నాయి. తాజాగా ఈ విషయమై హరిప్రియ స్పందించారు. తాను నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గత నెలరోజుల నుంచి పర్యటిస్తున్నానని హరిప్రియ తెలిపారు. కానీ ఎక్కడా జరగని ఘటనలు కామేపల్లి మండలంలో జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. తమపై దాడి వెనుక కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని ఆమె ఆరోపించారు.
గోవింద్రాల గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిలో పలువురు టీఆర్ఎస్ నేతలకు గాయాలు అయ్యాయని హరిప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఉన్న కక్షతోటి కొంతమంది నేతలు ఈ దాడి చేయించారనీ, దీంతో తనపై దాడిచేస్తున్న వారిపై ప్రజలు తిరగబడ్డారని చెప్పారు. కామేపల్లి మండలంలో ప్రస్తుతం గడీల రాజకీయాలు నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను గోవింద్రాల గ్రామస్తులు ఎవరూ అడ్డుకోలేదనీ, తనకు ప్రజాబలం ఉందని అన్నారు. తనపై ఈరోజు జరిగిన దాడి గిరిజన మహిళలు అందరిపై జరిగిన దాడేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు.