sam pitroda: 15 ఏళ్ల పాటు పార్లమెంటులో రాహుల్ పక్కనే కూర్చున్నారు.. మీరు ఇప్పుడే నిద్ర లేచారా?: శామ్ పిట్రోడా
- రాహుల్ గాంధీ గర్వించదగ్గ ఓ భారతీయుడు
- ఆయన పౌరసత్వంపై 15 ఏళ్ల నుంచి లేని అనుమానాలు ఇప్పుడే ఎందుకు వచ్చాయి?
- మోసపోవడానికి ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందన్న బీజేపీ నేతల ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడా మండిపడ్డారు. 15 ఏళ్ల నుంచి రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారని, మీతో పాటే పార్లమెంటులో కూర్చుంటున్నారని, ఇన్నేళ్ల నుంచి ఆయనతో కలసి మీరంతా పని చేస్తున్నారని, ఎప్పుడూ లేని అనుమానాలు మీకు ఇప్పుడే వచ్చాయా? అని ప్రశ్నించారు. మీ తప్పుడు ఆరోపణలతో మోసపోవడానికి ప్రజలేమైనా అమాయకులనుకుంటున్నారా? అని అన్నారు.
ప్రజలకు అన్నీ తెలుసని, వారిని తక్కువగా అంచనా వేయవద్దని చెప్పారు. ప్రతిసారి ప్రజలను మోసం చేయాలనుకుంటే కుదరదని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెబుతారని చెప్పారు. రాహుల్ పౌరసత్వంపై మీకు అనుమానాలు ఉంటే... ఈ 15 ఏళ్లలో ఎప్పుడైనా అడిగి ఉండవచ్చని, ఎన్నికలకు రెండు వారాల ముందు అడగడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒక గర్వించదగ్గ భారతీయుడని చెప్పారు.
రాహుల్ పౌరసత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఒక యూకే కంపెనీలో తాను బ్రిటన్ పౌరుడినని రాహుల్ పేర్కొన్నట్టు ఫిర్యాదులో స్వామి ఆరోపించారు. ఈ నేపథ్యంలో, పౌరసత్వంపై వివరణ ఇవ్వాలంటూ రాహుల్ కు కేంద్ర హోం శాఖ ఇటీవలే నోటీసులు జారీ చేసింది.