Andhra Pradesh: చంద్రబాబు గారడీలు చూసి ఏపీ మంత్రులంతా తలోచోట దాక్కుంటున్నారు!: వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ
- ఇంకా అధికారంలోనే ఉన్నామని భ్రమ పడుతున్నారు
- బినామీలకు కారుచౌకగా భూములు ఇచ్చేందుకే కేబినెట్ భేటీలు
- హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత
ఇంకా అధికారంలో ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భ్రమ పడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గత ఐదేళ్లలో కేబినెట్ సమావేశాలతో చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. ఏపీలోని భూములను తన తాబేదార్లు, బినామీలకు కారు చౌకగా కట్టబెట్టేందుకే చంద్రబాబు కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల కాలంలో ఏనాడైనా భూముల కేటాయింపులు లేకుండా ఏపీ కేబినెట్ సమావేశాలు ముగిశాయా? అని అడిగారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.
అధికారం పోతున్న చివరి దశలో కేబినెట్ సమావేశాలు పెట్టి చంద్రబాబు ఏం సాధిస్తారని పద్మ అడిగారు. ‘పరిమితికి మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఇప్పుడు కేబినెట్ సమావేశాల్లో అప్పులు తీరుస్తామని ప్రకటన చేస్తారా..? ఐదేళ్ల క్రితం రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఒక్క కేబినెట్ నిర్ణయంతో ఆ రుణమాఫీ చేస్తారా? గత ఐదు నెలలుగా ఏపీలో ఉద్యోగులకు జీతాలు లేవు.. ఆ జీతాలు ఇప్పుడు చెల్లిస్తామని కేబినెట్ సమావేశంలో ప్రకటిస్తారా?
పీడీ అకౌంట్లలో ఉన్న సొమ్మంతా ఖాళీ చేశారు. ఇప్పుడు సంక్షేమ హాస్టళ్లలో భోజనానికి కూడా అవకాశం లేకుండా చేశారు. ఈ పరిస్థితిని సరిదిద్దుతామని ప్రకటిస్తారా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు గారడీలు చూసి అధికారం కోల్పోతున్నామని కేబినెట్ మంత్రులంతా తలోచోట దాక్కుంటున్నారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. ఏపీ మంత్రివర్గం మొత్తం చంద్రబాబు రోత విన్యాసాలను చూసి ఏవగించుకుంటోందని దుయ్యబట్టారు.