Chandrababu: కేజ్రీవాల్‌పై దాడి.. వారి ఓటమికి సంకేతం: చంద్రబాబు
- సీఎంపై దాడిని ఖండించిన చంద్రబాబు
- సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమన్న బాబు
- వ్యవస్థలను నాశనం చేస్తున్న వారి పనే ఇది
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడిని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఖండించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఓ ట్వీట్లో పేర్కొన్నారు. కేజ్రీవాల్‌పై దాడికి ఢిల్లీ పోలీసులే బాధ్యత వహించాలన్నారు. సమాఖ్య స్ఫూర్తికి ఇది పూర్తి విరుద్ధమన్నారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేసే శక్తులు ఇప్పుడు భౌతిక దాడులకు దిగుతున్నాయంటూ పరోక్షంగా బీజేపీపై ఆరోపణలు చేశారు.
ఓడిపోతున్నామన్న నిరాశతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటి వరకు ఓడించడానికి, అణచివేయడానికి, పార్టీని కనుమరుగు చేయడానికి, అవమానించడానికి, కుంగుబాటుకు గురిచేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని, కుదరకపోవడంతో ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇది వారి ఓటమికి సంకేతమని చంద్రబాబు పేర్కొన్నారు.