Andhra Pradesh: కేవీపీ రామచంద్రారావు ఓ గుంట నక్క.. జగన్ కు దోచిపెట్టింది ఆయనే!: దేవినేని ఉమ
- చంద్రబాబు హయాంలో జాతీయ అవార్డులొచ్చాయి
- వైఎస్ హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారు
- కాలేజీ మీడియాతో ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిధుల్ని జగన్‌కు దోచిపెట్టింది కేవీపీ రామచంద్రారావేనని టీడీపీ నేత, ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయన అబద్ధాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో పోలవరానికి పలు జాతీయ అవార్డులు వచ్చిన విషయాన్ని ఉమ గుర్తుచేశారు. అదే వైఎస్ హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని దుయ్యబట్టారు. ఉమ ఈరోజు మీడియాతో మాట్లాడారు.
కేవీపీ రామచంద్రారావు ఓ గుంటనక్కలా వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కేవీపీ ఎప్పుడైనా పోలవరం గ్యాలరీ వాక్ చూశారా? అసలు గ్యాలరీ వాక్ అంటే ఏంటో ఆయనకు తెలుసా? పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడవద్దంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎప్పుడైనా లేఖ రాశారా?’అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇవేమీ పట్టించుకోని కేవీపీ ఇప్పుడు పోలవరంపై ఉత్తరాలు రాస్తున్నారని ఏద్దేవా చేశారు. ఏపీకి రావాల్సిన రూ.4,580 కోట్లను కేంద్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రాజెక్టులకు నిధులు రాకుండా ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని ఉమ స్పష్టం చేశారు.