Chandrababu: ఇప్పుడేం చెప్పవద్దు... నాకన్నీ తెలుసు: చంద్రబాబునాయుడు
- రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో సమీక్ష
- మేయర్ సహకరించలేదని కార్యకర్తల ఫిర్యాదు
- తనకు ఏమీ చెప్పవద్దన్న చంద్రబాబు
- గెలిచేది టీడీపీయేనని వ్యాఖ్య
రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించిన వేళ, నగర మేయర్ పంతం రజనీ శేషసాయి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయలేదని కొందరు నేతలు వ్యాఖ్యానించగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకన్నీ తెలుసునని, ఆ విషయాలేమీ ప్రస్తుతానికి తన వద్ద ప్రస్తావించవద్దని ఆదేశించారు. ఎవరు పని చేస్తున్నారో, ఎవరు బయటకు వెళ్లి వ్యతిరేకంగా పని చేశారో, అందరి జాబితా తన వద్ద ఉన్నదని అన్నారు.
ఈ ఎన్నికల్లో గెలిచేది టీడీపీయేనని, మరోసారి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించిన ఆయన, ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరినీ తాను గుర్తు పెట్టుకుంటానని అన్నారు. ఇటీవలి కాలంలో పార్టీలోకి వచ్చిన నాయకులు, పార్టీ కోసం పని చేసిన నాయకుల జాబితాను ఆయన చదివి వినిపించారు. ఎంతో మంది పార్టీ కార్యకర్తలు విజయం కోసం శ్రమించారని, ఈ స్ఫూర్తిని కౌంటింగ్ ముగిసేంతవరకూ చూపించాలని సూచించిన చంద్రబాబు, చివరి ఓటును లెక్కబెట్టేంతవరకూ ఏజంట్లు కౌంటింగ్ కేంద్రాన్ని వీడరాదని సూచించారు.
తాను బూత్ ల వారీగా వచ్చిన ఓట్లను కూడా పరిశీలిస్తానని, ఆధిక్యతను తెచ్చిన బూత్ లెవల్ నాయకులకు మంచి గుర్తింపును ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏ ప్రాంత నాయకుడైనా, సొంత బూత్ లో ఆధిక్యతను తెచ్చుకోకుంటే, అది మైనస్సేనని వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఎవరికి వారు తమ బలం, బలహీనతలను విశ్లేషించుకోవాలని సూచించారు.