Andhra Pradesh: ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి.. మరో 5 రోజులు ఏపీ అగ్నిగుండమే!: ఆర్టీజీఎస్ హెచ్చరిక
- ఏపీలో వడగాలులు వీస్తాయి
- 210 మండలాలపై గట్టి ప్రభావం
- బయటకు రావద్దని సూచించిన ఆర్టీజీఎస్
ఆంధ్రప్రదేశ్ లో మరో 5 రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని ఏపీ ప్రభుత్వానికి చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. దీని ప్రభావం 5 జిల్లాలపై తీవ్రంగా ఉందని అభిప్రాయపడింది.
ప్రకాశం జిల్లాలోని కారంచేడులో 44 డిగ్రీలు, గుడ్లూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత, కృష్ణా జిల్లా మొవ్వలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయిందని చెప్పింది.
అలాగే నెల్లూరు జిల్లాలో 42.62 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని పేర్కొంది. గుంటూరు జిల్లా ఈపూరులో దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందంది. కాబట్టి ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. అలాగే ద్రవపదార్థాలు విరివిగా తీసుకోవాలని చెప్పింది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలంది. ఏపీలో మొత్తం 210 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.