Narendra Modi: సారీ... స్పందించడం ఆలస్యమైంది! పీఎంవో ఆరోపణలకు మమత కౌంటర్
- ఆ సమయంలో ప్రచారంలో ఉన్నానంటూ ట్వీట్
- మోదీపై విమర్శలు
- రాజీవ్ పై ఉపయోగించిన భాష సరికాదంటూ ఆగ్రహం
ఫణి తుపానుకు సంబంధించి మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రెండుసార్లు ఫోన్ లో ప్రయత్నించినా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందుబాటులోకి రాలేదని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సారీ... స్పందించడంలో కాస్త ఆలస్యమైనట్టుంది! ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో ఉన్నాను అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
అంతేకాకుండా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలపైనా దీదీ స్పందించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై కాలంచెల్లిపోయిన ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని పేర్కొన్నారు. రాజీవ్ గారు మాతృభూమి కోసం తన జీవితాన్ని అంకితం చేయడమే కాదు, దేశం కోసం నేలకొరిగారు, అలాంటి వ్యక్తిపై ప్రధాని ఉపయోగించిన భాషను ఖండిస్తున్నాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.